తెలంగాణ సంస్కృతికి ప్రతీక "బోనం".. * పలు సంఘాల బోనాల పండుగలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..





( గ్రామీణ రక్షణ ) ఇందూరు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహత్తర పండుగ బోనాలు అని  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని కోటగల్లిలో గల కట్ట మైసమ్మ ఆలయం, నాందేవ్ వాడ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగలో పాల్గొన్నారు.




 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ఆషాఢ మాసం తెలంగాణకు ప్రత్యేక మాసం అన్నారు. గ్రామ దేవతలకు పూజిస్తూ.. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పశువులు ఆరోగ్యంగా ఉండాలని కొలిచే పండగ అన్నారు. బోనాలు కేవలం పండుగ మాత్రమే కాదని, ఇది మన పూర్వీకుల సంప్రదాయాన్ని.. గ్రామదేవతల పట్ల ఉన్న విశ్వాసాన్ని తరతరాలకు అందించే ఆధ్యాత్మిక వేడుక అన్నారు. 




* బోనం అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలు పాలు, బెల్లంతో వండిన అన్నాన్ని.. కొత్త కుండలో పెట్టి, వేపాకులు, పసుపు, కుంకుమలతో అలంకరించి తలపై మోసుకుంటూ అమ్మవారికి సమర్పిస్తారన్నారు. పోతురాజుల నృత్యాలు, ఘటం ఊరేగింపులు, రంగం వంటి సంప్రదాయాలు పండుగకు మరింత వైభవాన్ని తీసుకువస్తాయన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చింతకాయల రాజేందర్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, కోటగల్లి మైసమ్మ ఆలయ ప్రతినిధులు దేవేందర్, గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments

Close Menu