నిజామాబాద్ నగరంలో శ్రీ భూలక్ష్మీ మాత అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ భూలక్ష్మీ మాత బోనాల సమర్పణ మహోత్సవం శుక్రవారం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నగర కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు బోనాలతో, మంగళ వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలను సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలు, శివసత్తుల పూనకాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ నగర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని శ్రీ భూలక్ష్మీ మాతను ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి, TTCST రాష్ట్ర చైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, స్థానిక కార్పొరేటర్ స్రవంతి రెడ్డి, మాజీ మేయర్ ఆకుల సుజాత, అభివృద్ధి కమిటీ సభ్యులు తోట గోపాల్, మిద్దె రవి, ఆకుల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ మహోత్సవంలో కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
0 Comments